CBN: వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు

CBN: వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు
ఓటమిపై స్పష్టతతోనే సిట్‌ కార్యలయాల్లో దస్త్రాలు దహనం... విరాళాలు అందించే వెబ్‌సైట్‌ ప్రారంభించిన చంద్రబాబు

దేశం సరైన దిశలో వెళ్తోంటే ఆంధ్రప్రదేశ్ రివర్స్ లో వెళ్తోందని చంద్రబాబు ఆరోపించారు.ప్రజల్లో గతంలో ఎప్పుడూ చూడని అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీని దారుణంగా దెబ్బతీసిన వైసీపీకి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకూడదని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడం వల్లే సిట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఉగాది సందర్భంగా పార్టీకి విరాళాల కోసం వెబ్ సైట్ ను ప్రారంభించిన చంద్రబాబు .తనవంతుగా 99వేల 999 రూపాయలు విరాళం ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్లు ఉండొచ్చన్న ఆయన కానీ అవి పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్దంగా చేయొచ్చని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల విధానం వస్తే.. రాజకీయ అవినీతి తగ్గుతుందని వివరించారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు 10 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఇవ్వొచ్చునని సూచించారు.


ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐదేళ్ల పాలన మొత్తం చేదు, కారంతో జగన్‌ నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సమాజంలో జగన్‌కు స్థానం లేకుండా పోతుందని... కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. వేద పండింతులు చంద్రబాబుకు ఉగాది పచ్చడి ఇచ్చి ఆశీర్వచనం అందించారు. పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఐదేళ్ల కష్టాలు మర్చిపోయి కొత్త ఆశలతో ఉగాదిని ప్రారంభిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలని ఆకాంక్షించారు. గత ఐదేళ్లుగా ఉగాది పచ్చడి లాంటి షడ్రుచులు రాష్ట్రంలో లేవని విమర్శించారు. చరిత్రలో బకాసురుడిని చూశామని.. జగన్ పాలన అంతకుమించి ఉందని మండిపడ్డారు. వాలంటీర్లలో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీలు జట్టు కట్టాయని చంద్రబాబు వివరించారు. ముస్లిం సోదరులు సహా, ఈ గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తామని తేల్చిచెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story