Tragic Death : కూతురి మరణ వార్త తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

కూతురు మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగిన విషాద ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో జరిగింది. నిమ్మకాయల శ్రీనివాసరావు.. భార్య ఉషారాణి, కుమార్తె సాయి మేఘనతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. సాయి మేఘన తరచూ ఫిట్స్‌తో బాధపడుతుండేది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఉదయం సాయి మేఘనకు ఫిట్స్ రావడంతో ఇంటిలో పడిపోయింది.
తల్లిదండ్రులు ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి అదే అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చిచూసి సాయి మేఘన మృతి చెందినట్లు చెప్పారు. కూతురి మరణ వార్తను తట్టుకోలేక తల్లి ఉషారాణి కుప్పకూలింది. స్పృహ తప్పిపడిపోయిందని భావించిన శ్రీనివాసరావు ఆమె ముఖంపై నీళ్లు చల్లి లేపేందుకు యత్నించారు.
ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి వైద్యుడ్ని పిలిచి పరీక్ష చేయించారు. గుండెపోటుతో ఉషారాణి మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. నిమిషాల వ్యవధిలో భార్య, కూతురు మృతి చెందడంతో శ్రీనివాసరావు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనను చూసిన గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం సాయంత్రం తల్లీ కూతుళ్లకు అంత్యక్రియలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com