AP : పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం : చంద్రబాబు

పోలవరంపై కేంద్ర మంత్రి అమిత్ షా నిర్దిష్టమైన హామీ ఇచ్చారని ధర్మవరం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ‘అమరావతికి కూడా కట్టుబడి ఉన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని కూడా పోలవరంపై హామీ ఇచ్చారు. పోలవరం పూర్తి చేసి, హంద్రీనీవాతో అనంతపురంలోని ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. జగన్ రాయలసీమ ద్రోహి. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు.
అమరావతిని నాశనం చేసిన జగన్‌ను ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 3 రాజధానుల పేరుతో జగన్ అసలు రాజధాని లేకుండా చేశారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చారు. అమరావతిని దేశంలోనే నం.1 రాజధానిగా చేస్తాం. దుర్మార్గుడిని ఇంటికి పంపాలని షా చెప్పారు. కేంద్రంతో కలిసి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కేంద్ర సహకారంతో సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తాం అని స్పష్టం చేశారు.
మరోవైపు వైసీపీ నేతలు ఐదేళ్లలో గోతులు, బూతులు, దాడులు తప్ప ప్రజలకు ఏం ఇచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పొన్నూరు సభలో మాట్లాడిన ఆయన.. ‘నేను ఇక్కడకు వస్తున్నానని తెలిసి.. వైసీపీ నేతలు హెలిప్యాడ్ తవ్వేశారు. ఇదో ఉగ్రవాద చర్య. మా ప్రభుత్వం రాగానే మీపై చర్యలు తీసుకుంటాం. వైసీపీ నేతలు మట్టి తవ్వి రూ.2వేల కోట్లు సంపాదించారు. పిచ్చి వేషాలు వేస్తే మీ మక్కెలు ఇరగ్గొట్టి కింద కూర్చోబెడతాం’ అని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com