YCP: ప్రలోభాలకు తెరతీసిన వైసీపీ

YCP: ప్రలోభాలకు తెరతీసిన వైసీపీ
పలుచోట్ల భారీగా పట్టుబడ్డ నగదు, మద్యం.... సంచలనంగా మారిన బియ్యం పంపిణీ

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పలుచోట్ల నోట్ల కట్టలు భారీగా దొరికాయి. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న బియ్యం పంపిణీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఓటర్లను భయపెట్టి తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు.

N.T.R. జిల్లా తిరువూరు 18వ వార్డు కౌన్సిలర్‌ పద్మ నీలిమ భర్త, వైసీపీ నాయకుడు దారా శ్రీనివాసరావు నివాసంలో 31 లక్షల రూపాయలను ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నగదు సిద్ధం చేశారని తెలుస్తోంది. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కంచికచర్ల మండలం గని ఆత్కూరులో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. ఇటీవల వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరిన చలపాటి వంశీకృష్ణ, అన్వేష్‌పై దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన నలుగురు వైసీపీ కార్యకర్తలు బొడ్రాయి సెంటర్లో ఇద్దరినీ దారుణంగా కొట్టారు. తెలుగుదేశానికి ప్రచారం చేస్తే... చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ వస్త్ర, వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు... 25 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు అధికార పార్టీకి చెందిన వ్యక్తివిగా గుర్తించినట్లు సమాచారం.


ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు వైసీపీ నేతలు వినూత్న ప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్లూ ఓటుకు 3000, చీరలు, గృహోపకరణాలు పంపిణీ చేసిన అధికార పార్టీ నాయకులు... బియ్యంతో కూడా ఎర వేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి ఆటోల్లో వచ్చి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.... రెండు వాహనాలను, వందల సంఖ్యలో బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు మరో కొత్త ఎత్తుగడ వేశారు. తెల్లారేసరికి నోట్లతో వ్యవహారాన్ని నడిపించారు. వాలంటీర్లు ఓటరు లిస్టు పట్టుకుని... ఇంటింటికీ వెళ్లి 50, 10 రూపాయల నోట్లు పంపిణీ చేశారు. ఎవరికి ఏ నోట్ ఇచ్చారో.. ఆ సీరియల్ నెంబర్ రాసుకున్నారు. ఆ నోటు తీసుకుని వారు చెప్పిన రైస్ స్టోర్‌కి వెళ్లి.... నోటు ఇచ్చి బస్తా తీసుకువెళ్లడమే...! ఆ దుకాణదారుడు నోటు సీరియల్ నెంబర్ రాసుకొని...... వైసీపీ వాళ్లకు లెక్క చూపిస్తారు. ఓటుకు ఒక బస్తా... ఎన్ని ఓట్లు ఉంటే అన్ని బస్తాలు..అంటే నేరుగా ఎక్కడా వైసీపీ నాయకులు సీన్‌లో ఉండకుండా కథ నడిపించారు. రెండ్రోజుల క్రితం ఒంగోలులో అధికార పార్టీ నాయకులు... ఓటుకు 2 వేల రూపాయల చొప్పున పంచారని జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శిలో పోస్టల్ బ్యాలెట్‌కు 5వేలు చొప్పున పంచారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు నాయకులు... U.P.A. చెల్లింపులు కూడా చేపట్టారు. ఇలా డబ్బులు, బహుమతుల పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ వాళ్ళు తెగించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు వచ్చి చూసినా.... అరకొర కేసులు మాత్రమే పెడుతున్నారు.


ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకునేందుకు వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జిల్లా కోఆర్డినేటర్ పేరుతో మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లను వైసీపీ కార్యాలయంలోకి రప్పించి రహస్యంగా సమావేశం నిర్వహించారు. అక్కడ వాలంటీర్లను రాజీనామా చేయాలని... వైసీపీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. అలా బహిరంగంగా 49 మందితో, రహస్యంగా సుమారు 150 మందితో రాజీనామా పత్రాలు సమర్పించేలా చేశారు. పైగా రాజీనామా చేసిన వాలంటీర్లకు ఒక్కొక్కరికీ 5 వేల చొప్పున నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంటింటికీ వెళ్లి తాయిలాలు పంచేందుకు వైసీపీ నేతలు వాలంటీర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story