AP: జగన్‌ కాన్వాయ్‌లో ప్రమాదం

AP:  జగన్‌ కాన్వాయ్‌లో ప్రమాదం
X
ఫైర్ ఇంజిన్‌ను ఢీ కొట్టిన ఇన్నోవా కారు... ఎవరికీ గాయాలు కాలేదన్న పోలీసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయిలో ప్రమాదం జరిగింది. జగన్ శనివారం తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి కారులో పులివెందుల వెళ్తున్న సమయంలో రామరాజుపల్లి వద్ద వైఎస్ జగన్ కాన్వాయిలోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. జగన్ కాన్వాయిలోని ఇన్నోవా కారు.. ఫైర్ ఇంజిన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగన్‌ను చూడ్డానికి జనం ఎగబడటమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. రోడ్డుపై గుమిగూడిన ప్రజలను పలకరించేందుకు జగన్ కాన్వాయిని స్లో చేశారు. దీంతో కాన్వాయిలోని కారు.. ముందున్న ఫైరింజన్ ఢీకొంది. దీంతో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక పర్యటనలో భాగంగా మూడురోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ ఉంటారు.


ఈ మూడు రోజులు వైఎస్ జగన్.. వైఎస్ఆర్ ఘాట్ సందర్శిస్తారు. అలాగే రాయలసీమలోని వైసీపీ నేతలతో భేటీ అవుతారు. రాయలసీమలో ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఉత్తరాంధ్ర సంగతి ఎలా ఉన్నప్పటికీ తమ పార్టీకి గట్టి పట్టున్న రాయలసీమలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉండేది. అయితే ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలోనూ ఆ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 11 సీట్లు వస్తే.. రాయలసీమలో ఏడు సీట్లు వచ్చాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇక వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కడపలోనూ వైసీపీకి దారుణ ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది

కాంట్రాక్టర్ల ఝులక్‌

ఎమ్మెల్యే హోదాలో తొలిసారి పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు సొంత పార్టీ నేతలు ఝలక్‌ ఇచ్చారు. బిల్లుల కోసం జగన్‌ను నిలదీసినంత పనిచేశారు. బిల్లులు కాకపోతే మా ఆస్తులు అమ్మినా కూడా చేసిన అప్పులు తీరవని... తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నుంచి కూడా బిల్లుల కోసం అధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సహనంతో ఉండాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని జగన్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో జగన్‌ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మూడు రోజుల పర్యటనకు జగన్‌ ఆయన సొంత జిల్లాకు వచ్చారు. పులివెందులకు వెళ్లేసరికి అక్కడ జనం పెద్దగా లేరు. తర్వాత వైసీపీ నాయకులు భారీ స్థాయిలో జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేసి, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నవారంతా అక్కడకు వచ్చారు.

Tags

Next Story