AP: పులివర్తి నానిపై హత్యాయత్నం

AP: పులివర్తి నానిపై హత్యాయత్నం
X
పోలింగ్‌ పూర్తైనా కొనసాగుతున్న వైసీపీ నేతల విధ్వంసకాండ

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ పూర్తైనా..వైసీపీ నేతల విధ్వంసకాండ ఆగలేదు. తిరుపతిలో పద్మావతి మహిళా వర్శిటీలో స్ర్టాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. బీరు బాటిళ్లు, కర్రలు, రాడ్‌లతో నాని కారుపై దాడి చేశారు. అడ్డుకున్న నాని భద్రతా సిబ్బందిని. తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు మహిళా వర్సిటీ వద్ద ఆందోళనకు దిగాయి. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జి చేసిన పోలీసులు పులివర్తిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తికావడంతో ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బయలుదేరగా యూనివర్శిటీ ప్రాంగణంలో వైసీపీ మద్దతు దారులు నానిపై దాడికి దిగారు. కార్లలో వచ్చిన వైసీపీ శ్రేణులు బీరు బాటిళ్లు, కత్తులు, రాడ్లతో దాడికి యత్నించారు. కారులో ఉన్న నానిపైన దాడికి యత్నించగా ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బందిపైనా దుండగులు దాడి చేయడంతో ధరణి అనే గన్‌మెన్‌ తీవ్రంగా గాయపడ్డారు. చివరకు గన్‌మెన్ ధరణి గాల్లోకి కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ప్రతిఘటనతో. వైసీపీ మద్దతు దారులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో పులివర్తి నాని ఛాతికి.. బండరాయి తగిలి ఆయన గాయపడ్డారు.


కార‌్లలోని కెమెరాల్లో.. దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. దాడిపై ఆగ్రహంతో నాని.. పద్మావతి మహిళా వర్సిటీ వద్దే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇది తెలిసి భారీసంఖ్యలో చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు దాడిచేసిన వారు వదిలి వెళ్లినకారును ధ్వంసం చేశారు. దాడికి కారణమైన చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నడవలూరు సర్పంచ్‌ గణపతి పులివర్తి నానిపై దాడి చేశారని చెప్పారు. నానిని స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాదాపు 100 నుంచి 150 మంది పులివర్తి నానిపై దాడిచేశారని ఆయన కుమారుడు ఆరోపించారు. తెలుగుదేశం శ్రేణుల ఆందోళనలతో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వర్శిటీ వద్దకు భారీగా చేరుకుని నిరసనకారులపై లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్నా.. మీడియా ప్రతినిధులపైనా లాఠీఛార్జ్‌ చేయడంతో వారు ఆందోళన చేశారు. తర్వాత అక్కడకు చేరుకున్న తిరుపతి జిల్లా SPకృష్ణకాంత్‌ పటేల్‌ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో మాట్లాడానని ఆయన క్షేమంగా ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.

Tags

Next Story