AP: కారంపూడిలో వైసీపీ ఎమ్మెల్యే ఆరాచకం
పల్నాడు, అనంతపురం సహా వేర్వేరు జిల్లాల్లో వైసీపీ మూకలు వరుసగా రెండోరోజు అరాచకం సృష్టించాయి. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేయగా తాడిపత్రిలో తెలుగుదేశం నాయకుడు సూర్యమని ఇంటిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొట్టారు. ఈ క్రమంలో సీఐకి గాయాలయ్యాయి. సత్యసాయి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో కూడా వైసీపీ మూకలు తెలుగుదేశం కార్యకర్తలు, ఆస్తులపై దాడులకు దిగాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల అరాచం సృష్టించిన వైసీపీ మూకలు రెండోరోజు కూడా దాడులు కొనసాగించాయి. పల్నాడు జిల్లా మాచెర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో గాయపడినవారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి కారంపూడిలో భయానక వాతావరణం సృష్టించారు.
తెలుగుదేశం కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి రాళ్లు రువ్వి కుర్చీలు ధ్వంసం చేశారు.తెలుగుదేశం నేత జానీబాషా వాహనానికి నిప్పు పెట్టారు. బైకులను తగులబెట్టారు. వైసీపీ మూకలను నిలువరించేందుకు యత్నించిన సీఐ నారాయణని పిన్నెల్లి అనుచరులు కొట్టగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ధ్వంసమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం నాయకుడు సూర్యమని ఇంటిపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడికి పాల్పడగా ఈ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొట్టారు. ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ గాయపడ్డారు. ఈ దాడిపై ఫిర్యాదు చేయాడానికి వెళ్లిన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపైపోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొత్తూరులో వైసీపీ మూకలు చేసిన దాడిలో తెలుగుదేశానికి చెందిన అనసూయమ్మ గాయపడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడా అనసూయమ్మ, ఆమె బంధువులు జ్యోతి, ఈశ్వరమ్మ చిట్టెమ్మ, శకుంతల, లలితమ్మ,అడ్డుకునే ప్రయత్నం చేసి మరొకరిపై వైసీపీ శ్రేణులు దాడిచేశాయి.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబుల్ నాయనపల్లిలో తెలుగుదేశం కార్యకర్త లింగమయ్యపై వైసీపీ నాయకులు కర్రలు, కొడవళ్లతో విరుచుకుపడ్డారు. లింగమయ్య కుమారుడు సింహాద్రి కూటమి అభ్యర్థి సత్యకుమార్ తరఫున బూత్ ఏజెంటుగా పని చేశారు. ఈ దాడి విషయం తెలిసి సత్యకుమార్ ఆస్పత్రిలో లింగమయ్యను పరామర్శించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తంలో తెలుగుదేశం బూత్ ఏజెంట్ బాబు, క్లస్టర్ ఇంఛార్జ్ నందగోపాల్‌పై వైసీపీ నాయకులు కత్తులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నంచేసిన వాసి కేశవులు తలకు ఇనుపరాడ్డు తాకి తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెలుగుదేశం ఏజెంట్ పనిచేసిన బల్ల గ్రామవాసి వెంకటాచలం పొలంలోకి చొరబడిన వైసీపీ మూకలు అక్కడి సామాగ్రి, చెట్లకు నిప్పు పెట్టారు. బూరుగ మాకనపల్లిలో రామయ్య గౌడు పొలంలో కొబ్బరి చెట్లు, బిందు సేద్యం సామగ్రి కాల్చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గొల్లలపాలెంలో గంగాధర్ అనే తెలుగుదేశం కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com