AP: ఖరీఫ్‌కు ఖర్చులు లేక రైతన్న దిగాలు

AP: ఖరీఫ్‌కు ఖర్చులు లేక రైతన్న దిగాలు
X
రైతు భరోసా సాయంపై కొనసాగుతున్న సందిగ్దత.... ఖర్చులకు డబ్బులు లేక రైతుల ఆవేదన

నైరుతి రుతుపవనాలపై ఎన్నో ఆశలతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. పొలాలను దుక్కిదున్ని విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..., ఖరీఫ్ పెట్టుబడుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా సాయంపై సందిగ్ధత నెలకొంది. ఖరీఫ్ సాగుకు అందుతుందా... లేదా అని అధికార యంత్రాంగం సైతం చెప్పలేకపోతోంది. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక బిక్కుబిక్కుమంటున్నారు.


ప్రభుత్వం YSR రైతు భరోసా, ప్రధాన మంత్రి కిసాన్‌ పథకం కింద రైతులకు ఏటా 13వేల500 రూపాయల ఆర్ధిక సాయాన్ని మూడు విడతల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 7,500, కేంద్రం 6వేలు భరిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా విజయనగరం జిల్లాలో 2.63లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు విడతల్లో 355.3కోట్లు ప్రభుత్వం రైతులకు అందజేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత కింద సుమారు 208 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ మొత్తం విడుదలైతే సాగుదారులకు పంట సీజన్‌లో పెట్టుబడులకు ఆర్థిక తోడ్పాటు కలుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 1.39లక్షల మంది రైతులకు మూడు విడతల్లో 194.76కోట్ల రూపాయలు రైతు భరోసా సాయం లభించింది. 2024-25ఆర్థిక సంవత్సరానికి 80కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 2.55లక్షల మందిలో 1.39లక్షల మంది అర్హులుగా గుర్తించారు.

మరో పక్షం రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమవుతుంది. ఈ దశలోనే విత్తన కొనుగోళ్లు, పంట పొలాలు సిద్ధం చేసుకోవటం వంటి పనులకు రైతులకు పెట్టుబడి అవసరం. ఈ పరిస్థితుల్లో రైతు భరోసా సాయంపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా సాయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. సంబంధిత శాఖాధికారుల నుంచి సైతం సరైన సమాచారం లేదు. ఈ పరిస్థితుల్లో సాగు ఖర్చుల కోసం రైతుల్లో ఆందోళన నెలకొంది. తమకు ఏదో రకంగా ఆర్థిక సాయం అందిస్తే ఊతమిచ్చినట్లు అవుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ పెట్టుబడి సాయం రైతు భరోసా మొత్తంతో పాటు విత్తనాలు, ఎరువుల పంపిణీపైనా అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు..

Tags

Next Story