AP: జగన్ పర్యటన రద్దుపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పుంగనూరులో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అశ్వియ అంజూమ్ ఘటనపై కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించిందని వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్ి రామచంద్రారెడ్డి అన్నారు. ముగ్గురు మంత్రులు స్థానికంగా పర్యటించి నిందితులు అరెస్టయ్యేలా చూశారని, అందుకే తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో జరిగిన ఘటనలోనూ ప్రభుత్వం ఇలాంటి శ్రద్ధే కనబరచి ఉంటే బాగుండేదన్నారు. తమనేత పర్యటిస్తున్నారని తెలిసే ప్రభుత్వం పుంగనూరు ఘటనపై వేగంగా స్పందించిందని తెలిపారు.
కఠినంగా శిక్షిస్తాం
పుంగనూరు పట్టణంలో గత నెల 29న ఏడేళ్ల బాలిక అస్వియాను అపహరించి.. హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారిని కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. జగన్ సీఎంగా ఉన్న గత ఐదేళ్లలో వందల మందిపై అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన ఒక్కరోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టలేదని ఆక్షేపించారు. చిన్నారి హత్యను రాజకీయం చేసేందుకు పుంగనూరుకు జగన్ రావొద్దన్నారు. బాలికపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారని సాక్షి టీవీలో తప్పుడు వార్తలు ప్రసారాలు చేసి, బాధిత కుటుంబాన్ని మనోవేదనకు గురిచేశారని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదికలో ఒంటిపై చిన్న గాయం లేదని, మృతదేహం లభ్యమైనప్పుడు పరిశీలిస్తే దుస్తులు కూడా చిరగలేదని తేలిందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నిరంతరం పనిచేశాం
కేసు నమోదైన క్షణం నుంచి బాలిక మృతదేహం దొరికే వరకు 12 పోలీసు బృందాలు నిరంతరం విచారణ చేశాయని హోంమంత్రి వెల్లడించారు. సున్నితమైన ఈ అంశాన్ని రోజుల వ్యవధిలోనే తేల్చిన పోలీసులను ప్రశంసిస్తున్నానని... రానున్న రోజుల్లో ఇటువంటివి జరగకుండా చూస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. తమ కుమార్తె అపహరణకు గురైందని చెప్పిన వెంటనే పోలీసులు స్పందించి, దర్యాప్తు చేశారన్నారు. సీఎం చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని... చిన్నపిల్లలను ఈ విధంగా చేసిన వ్యక్తులను శిక్షించాలని బాలిక తండ్రి అజ్మతుల్లా తెలిపారు. వైసీపీ నాయకుడి కుమార్తె వేధింపులతో 2022 మార్చి 22న పలమనేరులో ఆత్మహత్య చేసుకున్న మిస్బా.. తల్లి నసీమా హోం మంత్రిని కలిసి తమ కుమార్తె మరణానికి కారణమైన వ్యక్తులను శిక్షించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com