NELLORE: నెల్లూరులో బరితెగించిన వైసీపీ నేతలు

NELLORE: నెల్లూరులో బరితెగించిన వైసీపీ నేతలు
కత్తులతో వైసీపీ నేతల వీరంగం... ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

నెల్లూరు జిల్లా కావలిలో అధికార వైసీపీ నాయకులు బరితెగించారు. నమ్మించి పలువురి వద్ద అప్పులు తీసుకోవడమే గాక... తిరిగి అడిగినవారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.... మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా కావలిలో అప్పు తీర్చమని అడిగిన తెలుగుదేశం నేతలపై వైసీపీ నాయకులు కత్తులతో దాడి చేశారు. ఘటనలో ఒక తెలుగుదేశం నాయకుడు మృతిచెందగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కావలికి చెందిన వైసీపీ నేత సుబ్బారెడ్డి చిట్టీల వ్యాపారం చేస్తూ... స్థానికంగా పలువురి వద్ద భారీగా అప్పులు చేశారు. టీడీపీ నేత సూరిశెట్టి సురేశ్‌కు సైతం డబ్బులు ఇవ్వాల్సి ఉండగా సుబ్బారెడ్డి తన ఇంటిని అతని వద్ద తనఖా పెట్టారు. అదే ఇంటిలో కొన్నిరోజులుగా సురేశ్ కుటుంబం నివాసం ఉంటోంది. డబ్బులు తిరిగి ఇవ్వకుండానే తన ఇల్లు తనకు ఇవ్వాలంటూ సుబ్బారెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంపై కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు సుబ్బారెడ్డి మరికొందరితో కలిసి సురేశ్‌పై కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారు.


కత్తుల దాడిలో సురేశ్ కుటుంబం తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలంలోనే సురేశ్‌ కుప్పకూలారు. వెంటనే కావలి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మామిడాల సుధాకర్, నాగిశెట్టి శ్రావణ్, సుష్మ, మరొకరికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు తరలించారు. సుబ్బారెడ్డి అందరి వద్దా డబ్బులు తీసుకున్నారని... తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.నిందితులు సుబ్బారెడ్డి, విజయ్‌రెడ్డితోపాటు ఈ ఘటనలో పాల్గొన్న వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story