YCP: రోజా పోటీ చేస్తే మద్దతివ్వం: వైసీపీ నేతలు

నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా మంత్రి రోజా పోటీ చేస్తే తాము మద్దతివ్వబోమని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు స్పష్టం చేశారు. తిరుపతిలో రోజా వద్దు జగన్ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోజాకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. రోజాకి తప్ప మరెవ్వరికి ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు. నియోజకవర్గంలో రోజా అవినీతి అక్రమాలను పెంచిపోషిస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు త్వరలో తాను తెలుగుదేశంలో చేరబోతున్నట్టు ఒంగోలు లోక్ సభసభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయనను ఇవాళ ఒంగోలు మాజీ MLA దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం స్థానిక నాయకులు కలిశారు. అంతా కలిసి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు భేటీ తర్వాత మాగుంట చెప్పారు. తెలుగుదేశం అధినాయకత్వం నిర్ణయించే ముహూర్తంలో తాను, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి సైకిలెక్కుతామని చెప్పారు. ఈసారి తన కుమారుడు రాఘవరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ సహకరించాలని కోరారు.
వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురం, తాడిపత్రిలో జరిగిన శంఖారావం సభలో ప్రసంగించిన లోకేశ్ నిరుద్యోగ యువతను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురు చూసిందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే జగన్ కు గుర్తుకొస్తున్నాయని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ ఏం చేశారో జగన్ ను ప్రజలు నిలదీయాలని కోరారు. తెలుగుదేశం- జనసేన- భాజపా పొత్తుతో సీఎం జగన్ కు వణుకు మొదలైందని లోకేశ్ అన్నారు.
ఇంకోవైపు ప్రధాని మోదీ పాల్గొనే మూడు పార్టీల తొలి బహిరంగ సభ ఈ నెల 17నే నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట బొప్పూడి వద్ద నిర్వహించే ఈ సభ తేదీని నేతలు ఖరారు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో సభ నిర్వహణ ఏర్పాట్లు జరగనున్నాయి. మరోవైపు జనసేన ఏడు అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే ప్రకటించింది. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. మిగిలిన 24 స్థానాల్లో జనసేన, భాజపాలు ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. బీజేపీ మంగళవారం ప్రకటిస్తుందనుకుంటున్న ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఏపీ నుంచి పలువురు అభ్యర్థుల పేర్లు ఉండవచ్చని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com