YCP: వైసీపీ నన్ను నడిరోడ్డుపై వదిలేసింది

YCP: వైసీపీ నన్ను నడిరోడ్డుపై వదిలేసింది
జగన్‌ ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదు.... చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా ఆవేదన


వైసీపీ నన్ను మోసం చేసిందని ఆ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల సర్వీసు ఉండగానే ఐఆర్‌ఎస్‌ ఉద్యోగాన్ని వదిలేసి వైసీపీలో చేరానని... సొంత ఖర్చులతో ఎన్నికల్లో పోటీచేసి గెలిచానని.... కరోనా సమయంలో కూడా భార్యాబిడ్డలను వదిలి ప్రజల్లో తిరిగానని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఏలూరు ఎంపీ, పార్టీపెద్దలు అధినేతను ప్రభావితం చేయడంతో పార్టీ తనను నడిరోడ్డుపై వదిలేసిందని వాపోయారు. వైసీపీ తనను మోసం చేసిందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అన్నారు.

ఇచ్చిన మాట కోసం ఎర్రగుంటపల్లి, సాగిపాడు పరిధిలో తన సొంత డబ్బులతో రెండు రోడ్లు వేశానని... తనకు టికెట్‌ ఇవ్వట్లేదన్న విషయం బయటకు రాగానే ప్రజలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. తనకే ఇవ్వాలని వినతిపత్రం రాసి స్వచ్ఛందంగా 80 శాతం పార్టీ కేడర్‌, 50 మంది సర్పంచులు సంతకాలు చేశారని అన్నారు. ఆ పత్రాన్ని వాళ్లు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఇచ్చారన్నారు. అయినా ఆ వినతిపత్రం సీఎంకు చేరలేదని... భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించుకుంటానని తెలిపారు.


ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు, తనకు విభేదాలు ఉండటంతో కుట్రపూరితంగా వ్యవహరించారని... ఎలీజాకు టికెటిస్తే ఓడిపోతారని ప్రచారం చేసి అభద్రతాభావం కల్పించారని అన్నారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగానే ఉన్నాయని... వైసీపీ చేయించిన సర్వేలో తనకు 54.62% ఓట్లు వస్తాయని తేలిందని అన్నారు. అయిదేళ్లలో ఏటా 350 రోజులు ప్రజలకు అందుబాటులో ఉన్నానని గుర్తు చేశారు. గడప గడపకు’లో 216 రోజులు పాల్గొన్నానని.. .సీఎంకు క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్పకుండా తప్పుదోవ పట్టించారని.... ఎంపీ వైపు మొగ్గు చూపి తనకు టికెట్‌ లేకుండా చేసి పొమ్మనకుండా పొగబెట్టారని ఎమ్మెల్యే వాపోయారు.

పెత్తందార్లకు.. పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమని సీఎం అనేకసార్లు చెబుతుంటారని..... చింతలపూడిలో నిజంగానే ఆ యుద్ధం జరిగిందని ఎలీజా అన్నారు. పేదల తరఫున పోరాడుతున్న తాను వదిలి పెత్తందారీతనం చేస్తున్న ఎంపీ వర్గం వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపారని ఎలీజా ఆరోపించారు. ప్రస్తుతం టికెట్‌ ఇచ్చిన విజయరాజు.. ఎంపీ మనిషని.... టీడీపీ, జనసేన పొత్తులో టికెట్‌ కోసం తిరుగుతున్న అంబేడ్కర్‌ కూడా వాళ్ల మనిషే అని అన్నారు. ఎవరు గెలిచినా అధికారం తన దొడ్లోనే ఉండాలనే శ్రీధర్‌ భావిస్తున్నారని... సీఎం ఈ పెత్తందారీతనాన్ని అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story