AP: జగన్ నోట.. తొలిసారి ఓటమి మాట

AP: జగన్ నోట.. తొలిసారి ఓటమి మాట
అధికారం నుంచి దిగిపోయినా బాధ లేదు.... అధినేత బేలగా మాట్లాడడంపై వైసీపీ శ్రేణుల ఆందోళన

175 స్థానాల్లో విజయం సాధిస్తాం... మరోసారి అధికారంలోకి వస్తామని ఎప్పుడూ చెబుతుండే ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్ నోట మొదటిసారి ఓటమి మాట వచ్చింది. వరసపెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్తున్న వేళ... తిరుపతిలో ఓ సదస్సులో పాల్గొన్న జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నపళంగా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చిన ఎలాంటి విచారం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని,......... తమ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందని ఆరోపించారు. అంశాల వారీగా కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు మరోసారి వెల్లడించారు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ‘వై నాట్‌ 175 కుప్పంలో కూడా గెలుస్తున్నాం’... అంటూ ఇన్నాళ్లూ మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడిలా ఒక్కసారిగా బేలగా మాట్లాడడం. చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో ‘ఇండియా టుడే’ విద్యాసదస్సులో పాల్గొన్న జగన్ ముఖాముఖిలో పలు ‌ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు.


56 నెలల పాలనలో శాయశక్తులా చిత్తశుద్ధితో పని చేశానని జగన్‌ అన్నారు. కోట్ల మంది ప్రజలకు సాయం అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, చెప్పిన పనులు చేశామని, మ్యానిఫెస్టోలో 99 శాతం అంశాలను అమలు చేశామని వివరించారు. ఆ మ్యానిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్లి వారి విశ్వాసాన్ని పొందుతున్నామని, అందుకే సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ఎంతో అవసరమన్న సీఎం ఆ గీతను కొనసాగిస్తూ వచ్చామని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతునిస్తూ వస్తున్నామని సీఎం చెప్పారు. అంశాలవారీ మద్దతు కేవలం బీజేపీకే పరిమితమా? కేంద్రంలో ఏ పార్టీ గెలిచినా ఇలాగే మద్దతిస్తారా అని ప్రశ్నించగా.... దీన్ని ఇక్కడే వదిలేద్దాం.. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం అంటూ... జగన్‌ దాటవేశారు.

కాంగ్రెస్‌ ఎప్పుడూ చెత్త రాజకీయాలే చేస్తుందని, విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని దుయ్యబ్టారు. కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేసినప్పుడు బాబాయ్‌ వివేకానందరెడ్డికి మంత్రి పదవిచ్చి మా పైనే పోటీకి నిలిపిందని వివరించారు. ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించి మరోసారి తమ కుటుంబాన్ని విడదీసిందన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చెబుతాడన్న జగన్‌ కాంగ్రెస్‌ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఉనికి లేదన్న సీఎం.... తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన, వారితో కలిసికట్టుగా వచ్చేవారితోనే వైసీపీ పోటీ అని స్పష్టం చేశారు. ఐతే.. గెలుస్తామనే ధీమా ఉన్నప్పుడు అభ్యర్థులను ఎందుకిలా మారుస్తున్నారని ప్రశ్నించగా ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటుందని, వాటి ఆధారంగా వ్యూహరచన చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై ప్రజలకు చాలా నమ్మకం ఉందని సర్వేల్లో తేలినా, కొందరు నాయకులపై జనంలో ఉన్న వ్యతిరేకత, సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ఇంకో 70 నుంచి 80 రోజులే ఉన్నాయని, చివరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చి గందరగోళం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ... ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story