AP: జగన్‌తో రాజకీయ పోరుకు షర్మిల సిద్ధం

AP: జగన్‌తో రాజకీయ పోరుకు షర్మిల సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం.... వైసీపీ ఓట్లకు, సీట్లకు షర్మిల గండం..

అన్నజగన్‌పై రాజకీయ పోరుకు చెల్లెలు షర్మిల సిద్ధమయ్యారు. వైసీపీ అధ్యక్షుడిగా జగన్‌ ఉండగా... ఇప్పుడు ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్‌కు ఏపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. రెండు వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. షర్మిల రాకతో వైసీపీ ఓట్లకు, సీట్లకూ గండమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. జగనన్న వదిలిన బాణాన్నిఅంటూ చెప్పుకొన్న షర్మిల... నేడు ఆయన వైపే దూసుకొస్తోంది. కాంగ్రెస్‌కు ఏపీ అధ్యక్షురాలిగా ఆమె నియమితులయ్యారు. ఏపీలో 2019లో జగన్‌ అధికార పీఠమెక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తరవాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే కొనసాగారు. అయినా కొంతకాలంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని.., తెలంగాణ రోడ్లతో పోలుస్తూ అప్పటి సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పటి నుంచే ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.


ఏపీలో పార్టీని పునర్‌నిర్మించి... పూర్వవైభవం తీసుకొస్తానని... కాంగ్రెస్‌ పెద్దలను షర్మిల ఇటీవల దిల్లీలో కలిసినప్పుడు చెప్పారు. దీంతో వైకాపాను ఎదుర్కోవడానికి ఆమె దీటైన వ్యక్తి అని భావించి... ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుతో హడావుడిగా రాజీనామా చేయించింది. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే... షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నియమించారు. క్రైస్తవ మత ప్రబోధకుడైన షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ ప్రభావం క్రైస్తవల ఓట్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వర్గాన్ని ఇప్పటివరకు తమ పూర్తిస్థాయి ఓటు బ్యాంకుగా వైకాపా భావిస్తోంది. క్రైస్తవుల్లో మంచి ఆదరణ ఉన్న అనిల్‌ వల్ల.. అధికార పార్టీకి ఇబ్బందికరమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూనే త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్ఠానం అసెంబ్లీకే పోటీ చేయాలంటే... తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల.., లేదా.. పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఆదేశిస్తే... కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా చూసినా ఆమె పోటీ వైసీపీకి ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర నష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఈ నెల 4న షర్మిల చేరిన నాటి నుంచి ఆమె.. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులు కూడా.. కొందరు షర్మిలతో మాట్లాడినట్లు సమాచారం. వైసీపీ నుంచి బయటకొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెనకే నడుస్తానని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే నాటికి వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌లో చేరేలా ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story