AP : పవన్ వల్లే కూటమి సాధ్యమైంది: చంద్రబాబు

AP : పవన్ వల్లే కూటమి సాధ్యమైంది: చంద్రబాబు
X

కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణే అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చారని కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒకతాటిపైకి వచ్చి సమష్టిగా పని చేశాయని తెలిపారు. ‘గత ఐదేళ్లలో వ్యవస్థలు, ఎకానమీ కుప్పకూలాయి. ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారు. అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలీదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.

కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారనే విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో రాజకీయ మార్పులను చూశా. ఇప్పుడు మేం ఎన్డీఏతోనే ఉన్నాం. ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నా. ఆ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే మీకు(మీడియా) తప్పకుండా చెబుతా’ అని బాబు తెలిపారు.

అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని చెప్పారు.

Tags

Next Story