AP: ఏపీలో అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్‌ దృష్టి

AP: ఏపీలో అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్‌ దృష్టి
ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ... భారమంతా షర్మిలపైనే...

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఖరారుపై కూడా ఏఐసీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. బుధవారం పలువురు ఆశావాహులు రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌కు దరఖాస్తులు అందించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మస్తాన్ వలీ, బద్వేల్ నియోజకవర్గం నుంచి కమలమ్మ, మడకశిర నియోజకవర్గం నుంచి సుధాకర్ దరఖాస్తు చేసుకున్నారు.


అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. నేతలతో పాటు కార్యకర్తలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను స్క్యూటినీ చేసి అభ్యర్థుల ఎంపిక చేయనుంది. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ జాబితాకు ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పర్యటించనున్నట్లు మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా హోదాపై పోరాటాలు చేసిన జగన్ ... అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రయోజనాలను బీజేపీ వద్ద తాకట్టపెట్టారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ గట్టిగా మాట్లాడారన్న షర్మిల... అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాడలేదన్నారు. విశాఖకు ఏంచేశారు... రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని షర్మిల మండిపడ్డారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి.. కాంగ్రెస్ రావాలని నినదించారు.

. ప్రజలను కలుసుకోవడంతోపాటు... నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు ఏపీ పర్యటన చేపట్టిన PCC అధ్యక్షురాలు Y.S.షర్మిల.... ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ వ్యాఖ్యలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఏపీలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి బానిసల్లా పనిచేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ Y.S. రాజశేఖర్‌రెడ్డిని అవమానించిందని కొందరు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. అంతకుముందు కంచిలి నుంచి ప్రజాప్రస్థానం పైలాన్ ఉన్న ప్రాంతం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల...ప్రయాణికులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెరిగిన ధరలతో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story