Anna Canteens : తెలంగాణలో అన్న క్యాంటీన్లు.. పార్టీ విస్తరించే పనిలో టీడీపీ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) మానసపుత్రిక అన్న క్యాంటీన్లు ( Anna Canteens ) త్వరలో హైదరాబాద్ లోనూ ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చి వారి ఆదరణ పొందుతున్నాయి. రూ.5కే కడుపునిండా భోజనం పెడుతూ పేద, సామాన్యుల ఆకలి తీరుస్తున్నాయి. ఏప్పీ స్ఫూర్తితో టీడీపీ అధినేత చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలో సైతం అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసేందుకు ఆయన అభిమానుల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
ఆ దిశగా తొలి క్యాంటిన్ ఏర్పాటుకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో క్యాంటీన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అన్న క్యాంటీన్ల ద్వారా జులై మొదటి వారంలో రోజూ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. తెలంగాణలోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానానికి భారీగా వినతులు అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ వినతులు టీడీపీ నాయకత్వానికి చేరుతున్నాయి. తెలంగాణలోనూ మరోసారి బలం పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ అధిష్టానం అన్న క్యాంటీన్ల తరహాలో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని జిల్లా కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లోనూ అన్న క్యాంటీన్లను త్వరలో ఏర్పాటు చేస్తామని టీటీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అభిమానులు కృషి చేస్తున్నారు. నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో తొలి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com