PAWAN: ఆంధ్రప్రదేశ్‌లో విష ఘడియలు

PAWAN: ఆంధ్రప్రదేశ్‌లో విష ఘడియలు
కేంద్ర పథకాలకు వైఎస్సార్‌ పేర్లు... మోదీ సభలో మండిపడ్డ జనసేనాని పవన్‌కల్యాణ్‌

దేశం మొత్తం అమృత ఘడియలు ఉంటే... ఏపీలో మాత్రం వైసీపీ కారణంగా విష ఘడియలు ఉన్నాయని.... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. జగన్ పాలనలో అడుగడుగునా కుంభకోణాలేనని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు YSR, జగన్ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరంలోని వేమగిరి జరిగిన కూటమి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న పవన్.. వైకాపా అవినీతి కోటలను బద్ధలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘దేశానికి అభివృద్ధితోపాటు గుండె ధైర్యం అవసరం. పదేళ్లుగా భారత్‌ వైపు చూడాలంటేనే శత్రువుల భయపడుతున్నారు. మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందస్తోంది. కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు’’ అని అన్నారు.


ప్రధాని మోడీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. రాజమండ్రి వేమగిరిలో కూటమి తరపున నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అయోధ్యకు రాముడిని తీసుకొచ్చిన మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ శక్తి ఏంటో చూపించారని కొనియాడారు. దేశాభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా అవసరమేనని చెప్పారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. భారత్ వైపు చూడాలంటే పదేళ్లుగా శత్రువులు భయపడిపోతున్నారని చెప్పారు. మోడీ ఒక్క పిలుపుతో దేశంలోని ప్రతి అణువు కదిలి వస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు, పథకాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్లో వేసుకుంటోందని విమర్శించారు. కేంద్ర ఇస్తున్న కొన్ని పథకాలను సీఎం జగన్ సరిగా వినియోగించుకోలేకపోయారని పవన్ మండిపడ్డారు.

జగన్‌ మానసిక స్థితి బాలేదు

జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైద్యుల పరిశీలనలో ఆయన నార్సి విధానం అనే సమస్యతో ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఈ విషయంలో లాడెన్ , తాలిబన్లు, కిమ్ కు ఏ మాత్రం జగన్ తీసిపోరనిఅన్నారు. వాళ్లు చెప్పిందే చేయాలని, లేకపోతే దాడి చేసి చంపేస్తారని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని నిలదీశారు. తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ రాష్ట్రంలో ప్రజలను ఎలా చూసుకుంటారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను ఐదేళ్లుగా మోసం చేసిన జగన్ ఇక ఇంటికి వెళ్లక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అక్రమార్కులకు, దోపిడీ దారులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story