SHARMILA: వైసీపీ నేతలారా... ప్రత్యేక హోదా ఏదీ?

SHARMILA: వైసీపీ నేతలారా... ప్రత్యేక హోదా ఏదీ?
ఢిల్లీ వేదికగా నిలదీసిన షర్మిల.... ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని ఘాటు విమర్శలు

ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాంగ్రెస్‌ నేతలతో కలసి షర్మిల దీక్ష చేపట్టారు. దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మోడీ మాటిచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని షర్మిల ప్రశ్నించారు. ఒక్క M.L.A, M.P సీటు లేకపోయినా ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని ఆరోపించారు. సీఎం జగన్‌ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారవుతారని ఈ విషయంలో జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టిన షర్మిల.... పార్టీ నేతలతో కలసి.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.


ఢిల్లీలో తొలుత వివిధ పార్టీల నేతలను కలసిన షర్మిల.... ప్రత్యేక హాదా డిమాండ్‌కు పార్లమెంట్‌లో అండగా నిలవాలని... వారి మద్దతు కోరారు. NCP అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమై వారికి వినతిపత్రాలు అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్ లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.


ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని.. మోదీ చెప్పారని... ఏపీని స్వర్ణాంధ్ర చేస్తా అన్నారని షర్మిల గుర్తు చేశారు. పోలవరం పూర్తి చేస్తామని మోడీ హామీ ఇచ్చారని... ఇప్పుడు ఇవన్నీ ఏమయ్యాయని అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు చట్టప్రకారం కల్పించిన హక్కు ప్రత్యేక హోదా అని చెప్పుకొచ్చారు. ఏపీకి కొత్త రాజధాని కడతామని చెప్పి పదేళ్లు పూర్తయిందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు పూర్తయిందని... మరి ఇప్పుడు ఏపీకి రాజధాని ఏది అని నిలదీశారు.


కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏమైందన్నారు. హామీలు ఇచ్చిన పోర్ట్స్ నిర్మాణం.. ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడి జిల్లాలకు ఇచ్చిన ప్యాకేజీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తూ చివరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ నాయకులు ఎలా అవుతారని?... వీళ్లది పరిపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒక్క సీటు లేకపోయినా ఆంధ్రలో బీజేపీ రాజ్యమేలుతోందన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి ఎంతో ముఖ్యమన్నారు. ప్రత్యేక హోదా ఉండి ఉంటే వేల పరిశ్రమలు ఏపీకి వచ్చి ఉండేవన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story