ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏరోజో తెలుసా..?

Update: 2019-07-15 12:18 GMT

ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం మంగళవారం అర్ధరాత్రి ఏర్పడనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలో ఎక్కడినుంచైనా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలోకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఇవి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సంభవిస్తాయి. అయితే ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం.149 ఏళ్ల తర్వాత మళ్లీ గురు పూర్ణిమ రోజున గ్రహణం ఏర్పడటం విశేషం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత చంద్రుడు, భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో గరిష్ఠ గ్రహణం ఉంటుంది..

ఇది ఖండగ్రాస కేతు గ్రస్త చంద్రగ్రహణమని జ్యోతిషులు చెబుతున్నారు. మొత్తం 178 నిమిషాలపాటు ఉండే ఈ గ్రహణం ఉత్తరాషాడ, పూర్వాషాడ, శ్రవణ నక్షత్రాల్లో జన్మించినవారు, ధనుస్సు, మకర రాశుల వారిపై అధిక ప్రభావం చూపుతుందని అంటున్నారు. వృషభ, మిథున,కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి అరిష్టం.., తుల, కుంభ రాశులవారికి మధ్యమం, మేష, కర్కాటక, వృశ్చిక, సింహ, మీన రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిషులు అంటున్నారు.

శాస్త్రీయ పద్ధతులు, హిందూ సంప్రదాయాన్ని అనుసరించే వారు, గ్రహణం ముందు, గ్రహణ సమయంలో, గ్రహణం తరువాత స్నానాలు చేసి ధ్యానం చేస్తూ ఉండవచ్చని పండితులు చెబుతున్నారు... గ్రహణం విడిచిన తరువాత ఇంటిని శుభ్రం చేసి, దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు దాన్ని మార్చుకోవాలి. ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు..

చంద్రగ్రహణం కారణంగా పలు ఆలయాలు మూతపడనున్నాయి..తిరుమల శ్రీవారి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు మూసివేసి... బుధవారం ఉదయం నాలుగున్నరకు తెరవనున్నారు. ఆలయశుద్ధి, పుణ్యవచనం తరువాత స్వామి వారికి సుప్రభాత సేవ చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే చంద్రగ్రహణాన్ని అందరూ చూడొచ్చని.. చూస్తే ఏదో జరుగుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Similar News