వాడీవేడిగా జరుగుతున్న ఏపీ శాసనసభలో నవ్వులు కురిపించారు ప్రతిపక్షనేత చంద్రబాబు. వైసీపీ అభిమానం చూస్తుంటే తనకే ఆశ్చర్యమేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఏపీ, తెలంగాణ ఉమ్మడి నీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ప్రతిపక్షం నుంచి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడిన అనంతరం.. చంద్రబాబు నాయుడిని మాట్లాడాల్సిందిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. వారు సలహాలు ఇస్తే స్వీకరిస్తామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు వైసీపీలో చాలా మార్పు వచ్చింది.. చాలా సంతోషంగా ఉందన్నారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని అనగానే ఒక్కసారిగా సభలో సీఎం జగన్‌తో పాటు సభ్యులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు.