వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత తులసీరెడ్డి. జగన్‌కు మాట తప్పడం మడమ తిప్పడం దిన చర్యగా మారిపోయిందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 12 వేల 500 ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన జగన్.. ఇప్పుడు 6 వేల 500 మాత్రమే ఇస్తాం.. మిగతా 6 వేలు కేంద్రం ఇస్తుందని చెప్పడం దారుణమన్నారు.
పేదలందరికీ 45 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చి జగన్ మాట తప్పారని అన్నారు తులసిరెడ్డి. 45 ఏళ్లకే పెన్షన్ అని తాటికాయంత అక్షరాలతో తన పేపర్లోనే రాయించుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. జగన్ పాలన అంతా మాటలే తప్ప చేతల్లో ఏమీ లేదని మండిపడ్డారు.
మద్యపాన నిషేధం మూడు దశల్లో అమలు చేస్తానన్న జగన్.. ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందని అనడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు తులసీరెడ్డి. మాజీ సీఎం చంద్రబాబు కన్నా ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించడమే మద్య నిషేధమా? అంటూ నిలదీశారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీలాగే కాంగ్రెస్ కూడా ముప్పేట దాడి మొదలు పెట్టింది.