భారీ వర్షాలు, గోదావరి పరవళ్లు ఉభయగోదావరి జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరి వరద నీటితో ఏజెన్సీ, లంకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే లంక ప్రాంతాల్లోని పంటలు వరద ఉధృతికి నీటమునిగాయి.
ఎగువ కురిసిన వర్షాలతో పోలవరం ప్రాజెక్ట్‌లోని స్పిల్ ఛానెల్‌కు భారీగా వరదనీరు చేరుకుంటోంది. 19 గ్రామాలు ముంపునకు గురువుతుండటంతో.. స్పిల్‌వే ఛానెల్ వద్ద కుడివైపు గండికొట్టారు. మూడు లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. అయినవిల్లి మండలంలోని లంక గ్రామాల్లో ఇటుకబట్టీలు పూర్తిగా నీట మునిగాయి.