మండలి రద్దు చేయాలా? వద్దా? ప్రభుత్వ పెద్దల చర్చలు

Update: 2020-01-26 21:07 GMT

పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అంటూ నేరుగా అసెంబ్లీలోనే ప్రస్తావించారు సీఎం జగన్. మండలి నిర్వహణకు అయ్యే ఖర్చులతో సహా వివరించారు. ఆ ప్రసంగంతో మండలి రద్దు ఖాయమన్న చర్చమొదలైంది. సోమవారం దీనిపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుందామన్నారు సీఎం జగన్. అందుకు తగ్గట్లుగానే.. కేవలం మండలి అంశమే అజెండాగా సోమవారం మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఉదయం 9 గంటలకు జరిగే భేటీలో మండలి రద్దుకు ఆమోదం తెలిపి ఆ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత సభలోకూడా ఆమోదం పొందిన అనంతరం పార్లమెంట్ కు పంపి మండలి రద్దు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రభుత్వం మండలిలో సంఖ్యాబలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న వార్త కూడా పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే.. మండలి రద్దు ఆలోచనను విరమించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బలం పెరిగిన తర్వాత ప్రస్తుత ఛైర్మన్‌ను అవిశ్వాస తీర్మానంతో తొలగించి.. ఆ స్థానంలో వైసీపీ సభ్యుడిని కూర్చోబెట్టాలన్న వ్యూహాం కూడా ప్రభుత్వ మదిలో ఉందంటున్నారు విశ్లేషకులు. ఆ తర్వాత సెలక్టు కమిటీకి పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని ఉపసంహరించుకుని వాటికి చిన్న చిన్న మార్పులతో ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం పొందాలన్నది జగన్ సర్కారు ఆలోచనగా కనపడుతోందని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు సీఎం జగన్ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బేరసారాలు అవసరం లేదంటూ, రద్దుకే మొగ్గుచూపుతన్నారని తెలుస్తోంది. సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ముఖ్యనేతలు, అడ్వకేట్ జనరల్‌తోనూ సీఎం చర్చించినట్లు సమాచారం.

అటు తమ సభ్యులను ప్రలోభపెడుతున్నారన్న టీడీపీ విమర్శలను వైసీపీ తిప్పికొట్టింది. కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే శాసన మండలిలో అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. అందుకే మండలి అవసరమా అనే చర్చ జరుగుతోందన్నారు.

ప్రభుత్వం మండలి రద్దు దిశగా ఆలోచిస్తుంటే.. అటు ఛైర్మన్ మాత్రం.. సెలక్ట్‌ కమిటీల ఏర్పాటు దిశగా కసరత్తు మొదలుపెట్టారు. సభ్యుల పేర్లు ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలకు లేఖ రాశారు మండలి ఛైర్మన్ షరీఫ్. రెండు బిల్లులపై రెండు సెలక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో సెలక్ట్ కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారు. టీడీపీ నుంచి ఐదుగురు, బీజేపీ, వైసీపీ, PDF, నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారు. సెలక్ట్ కమిటీలకు ఛైర్మన్‌గా బిల్లులు ప్రవేశ పెట్టిన మంత్రులు అంటే బుగ్గన, బొత్స వ్యవహరిస్తారు.

Similar News