అక్రమ మద్యం అమ్మకాలు.. ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై అధిక ధరలకు విక్రయం

Update: 2020-05-16 10:21 GMT

కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న సమయమిది. ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా మారిన ఊళ్లు, పట్టణాలు. నలుగురైదుగురు గుమికూడటానికే పయపడే పరిస్థితి. ఇలాంటి సమయంలో మద్యం షాపులను తెరవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వద్దంటూ జనం రోడ్డెక్కుతున్నారు. అయితే, అదనుగా భావించి కొందరు ఎక్సైజ్ ఉద్యోగులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. క్వార్టర్ బాటిల్‌ను ఏకంగా వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లుపొడుస్తున్నారు.

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరులో.. క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎక్సైజ్ ఉద్యోగి షకీర్.. క్వార్టర్ మద్యాన్ని వెయ్యిరూపాయలకు అక్రమంగా విక్రయిస్తున్నాడు. తమిళనాడు నుంచి యదేచ్ఛగా తరలివస్తున్న మందుబాబులు, స్థానిక మద్యం ప్రియులు అక్రమ మద్యాన్ని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అక్రమ మద్యం అమ్మకాల తంతు రాత్రివేళల్లోనూ యదేచ్ఛగా సాగుతోంది.

మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేసి.. విచ్చలవిడిగా జరుగుతున్న ఈ అక్రమ అమ్మకాల వెనుక కొందరు అధికారుల అండదండలు కూడా వున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు మద్యం రవాణాను పోలీసులు అడ్డుకుని కేసులు నమోదు చేస్తుంటే.. మరోవైపు ఎక్సైజ్ అధికారులే విక్రయదారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతస్థాయి దృష్టిసారించి.. అక్రమ మద్యం విక్రయదారులు, ఇంటిదొంగలపై చర్యలను తీసుకోవాలని.. కరోనా వ్యాప్తిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

Similar News