ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. వాటిలో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ నేతలకు అవకాశం ఇచ్చారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు త్వరలోనే ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. వాటిల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీకి కేటాయించారు. మరోవైపు మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా త్వరలోనే ఛైర్మన్లను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో 37 చోట్ల టీడీపీకి చెందినవారికి, 8 చోట్ల జనసేన నేతలకు, 2 చోట్ల బీజేపీ నేతలకు పదవులు దక్కినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకూ 705 పోస్టుల భర్తీ
కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. తాజా నియామకాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 85 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తయింది. మిగిలినవాటిపై కూడా ప్రభుత్వవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. చాలా రోజులుగా ఈ జాబితా కోసం కూటమి లోని మూడు పార్టీల నేతలు వేచి చూస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత జాబితాను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది ఎంపిక చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మన్లను కూడా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం కేవలం టీడీపీ నుంచే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు పార్టీలకు ప్రాధాన్యత – సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకుని తాజా జాబితాను ప్రకటించారు.
అగ్నిప్రమాదంపై సీఎం ఆగ్రహం
సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. సెక్రటేరియట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించడంపై అధికారులను ప్రశ్నించారు. ఈ ప్రమాదం జరిగి ఎలా జరిగిందని ఆయన తెలుసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే సచివాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, 24 గంటలలోగా చెత్తను తీసివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఘటన వివరాలను సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనితను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? ఏ చోటు జరిగింది? ఏ సమయంలో చోటు చేసుకుంది? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, దాని ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు చంద్రబాబు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫొరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని సీఎం చంద్రబాబు అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలు సేకరించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.