పిల్లలను స్కూల్లో దింపి ఇంటికి వెళ్తూ తల్లి మరణించిన విచారకర ఘటన బుధవారం జరిగింది. మణికొండ-పుప్పాలగూడ పైపులైను రోడ్డులో సుందర్‌గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు జిల్లా కందుకూరుకు చెందిన ఇరువూరి వెంకీ, ఇరువూరి శాలిని ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ పుప్పాలగూడలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. మంగళవారం ఉదయం స్కూల్ బస్ మిస్ కావడంతో ఇద్దరు కుమార్తెలను తన స్కూటీపై ఎక్కించుకొని శాలిని జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యాభవన్ వద్ద దింపి తిరుగు ప్రయాణమైంది. మణికొండ-పుప్పాల్‌గూడ పైపు లైన్ మార్గంలో వేగంగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీకొని ఆమె తలపై నుంచి వెళ్ళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. శాలిని తమ్ముడు లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.