తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉందంది. బుధవారం కొన్ని జిల్లాల్లో ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా సోమవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వచ్చే రెండు రోజులు ఏపీలో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు.. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ నంద్యాల(D) గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం(D) తుమ్మికపల్లిలో43.3 డిగ్రీలు, ఆముదాలవలసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది.
మరోవైపు దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. జులై నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయని వెల్లడించింది. సగటు వర్షపాతం 106శాతం కంటే ఎక్కువ ఉంటుందని తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాలకూ వర్షపాతం పుష్కలంగా ఉంటుందని పేర్కొంది.