ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్‌పై గతంలో కేసు నమోదైంది.
2024, మే 11న నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర తరపున అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో శిల్పారవి కానీ, అల్లు అర్జున్ తరపున కాని ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో స్థానిక వీఆర్వో సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట 30 అమలును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. రేపు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.