AP: ఇంద్రకీలాద్రికి అమరావతి రైతులు

మొక్కులు చెల్లించుకునేందుకు విజయవాడకు కాలినడకన రైతులు.. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర;

Update: 2024-06-23 01:00 GMT

ప్రజా రాజధాని అమరావతి రైతులు ఇవాళ తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఇవాళ ఉదయం తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలి నడకన బయల్దేరారు. ఉదయం 11 గంటలలోపు అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర సాగనుంది. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో రాజధాని అమరావతి గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు. రైతులు, రైతు కూలీలు పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు. అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన ఇంద్రకీలాద్రికి అమ్మవారి దేవస్థానానికి రాజధాని రైతులు బయలుదేరారు. రాజధాని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. 2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేసింది.

అప్పట్లో రైతులను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ దారి పొడవునా రోడ్డు కడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయించింది. రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయ్ రావు, భారీగా పోలీసులతో మోహరించి.. ఆయనే స్వయంగా లాఠీలతో రైతులపై విరుచుకుపడ్డారు. గాయాలయి, రక్తం కారుతున్నా నాడు రైతులు వెనక్కి తగ్గలేదు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే ఈరోజు అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి బయలుదేరారు.

Tags:    

Similar News