Andhra Pradesh: ఏపీలో పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయి..?
Andhra Pradesh: ఏపీలో పంచాయతీరాజ్ నిధులను మొత్తం వాడేసుకుంది జగన్ ప్రభుత్వం.
Andhra Pradesh: ఏపీలో పంచాయతీరాజ్ నిధులను మొత్తం వాడేసుకుంది జగన్ ప్రభుత్వం. సర్పంచ్‌లకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా, ఎటువంటి తీర్మానాలు చేయకుండానే.. పీడీ అకౌంట్లలో ఉన్న పంచాయతీ నిధులను జగన్ ప్రభుత్వం తీసేసుకుంది. గ్రామాల్లో పన్నుల రూపంలో వచ్చే సొమ్ముతో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చే నిధులను కూడా మొత్తం ఊడ్చేశారు.
దీనిపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై. వి. బి.రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ ఛాంబర్ హై లెవెల్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఏపీలోని 12వేల 918 గ్రామ పంచాయతీలలో సర్పంచుల అకౌంట్ల నుంచి నిధులను వాడుకుందని వైవిబి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. దీనిపై నిన్న మధ్యాహ్నం హై లెవెల్ కమిటీ సభ్యులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.
సర్పంచుల అకౌంట్ల నుంచి వారి సంతకం లేకుండానే, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే, వేల కోట్ల రూపాయలను రాజ్యాంగ విరుద్ధంగా జగన్ ప్రభుత్వం నిధులను డ్రా చేసుకొని సొంత అవసరాలకు వాడుకుందని విమర్శించారు. ఈ చర్యను పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండించింది. ఈ నిధులను తిరిగి సర్పంచుల అకౌంట్లో జమ చేసేంత వరకు వివిధ రూపాల్లో నిరసనలు చేసేలా, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించారు.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రాజకీయాలతీతంగా సర్పంచులు సమావేశమై చర్చించుకొని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భిక్షాటన, వినతిపత్రాలు, ధర్నాలు, గ్రామ సభలు, గ్రామ పంచాయతీ అత్యవసర సమావేశాలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి, వాడుకున్న నిధులను సర్పంచుల అకౌంట్లలో వేసేంతవరకు పోరాడాలని తీర్మానించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సమావేశంలో నిర్ణయించారు.
పంచాయతీలను బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను సైతం జగన్ ప్రభుత్వం వాడుకుంది. అంతేకాదు, పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న నిధులను సైతం లాగేసుకుంది. నిజానికి పంచాయతీల నిధులను రాష్ట్రం తీసుకోవడానికి అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. కాని, జగన్ సర్కార్ వచ్చిన తర్వాత.. పర్సనల్ డిపాజిట్ అకౌంట్ల రూపంలో ఓ వెసులుబాటు కల్పించుకుందని చెబుతున్నారు.
దాని ప్రకారం రాష్ట్రంలోని పీడీ ఖాతాలన్నీ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నియంత్రణలోనే ఉంటాయి. ఆర్థిక శాఖ కార్యదర్శికి మాత్రమే ఖాతాల్లోని నిధులు తీసుకునేలా వెసులుబాటు తీసుకొచ్చారు. ఈ వెసులుబాటుతో గత డిసెంబరులో కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను లాగేశారు. మొన్న మార్చి 31వ తేదీన మరోసారి పంచాయతీల అకౌంట్లలోని నిధులను తీసేసుకున్నారు. ఇలా సర్పంచులు, పంచాయతీల కార్యదర్శులకు కూడా తెలియకుండానే మొత్తం నిధులను, పైసాలేకుండా పీల్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.