AP : ఏపీ హైకోర్టు న్యాయమూర్తినంటూ పోలీసులకు ఫోన్‌

Update: 2024-05-23 07:35 GMT

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిని మాట్లాడుతున్నాను అంటూ.. పోలీసులకు ఫోన్‌ చేసి, ఒక కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, వారి నుంచి తన వాళ్లకు రావాల్సిన డబ్బును వెంటనే రికవరీ చేయాలని హుకుం జారీ చేసిన నిందితున్ని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన ఓ చీటింగ్‌ కేసు విషయంలో బాఽధితులకు న్యాయం చేస్తానని, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తనకు సోదరి అంటూ.. గొట్టిపాటి సందీప్‌ అనే వ్యక్తి ఫిర్యాదుదారులను నమ్మించాడు. పోలీసులతో మాట్లాడించి సమస్య పరిష్కారమయ్యేలా చేస్తానని నమ్మబలికి వారి వద్ద రూ.50వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.

ఆ తర్వాత పోలీసులకు ఫోన్‌ చేసి.. తాను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిని మాట్లాడుతున్నానని ఒకసారి.. ఆ తర్వాత కొన్ని గంటలకు ఫోన్‌ చేసి గొంతుమార్చి తాను ఏపీ న్యాయమూర్తి పీఏను మాట్లాడుతున్నానని, మేడం చెప్పిన కేసు విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని మరోసారి పోలీసులను ప్రశ్నించాడు. దాంతో కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావుకు అనుమానం వచ్చింది.

ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఏపీ హైకోర్టులో ఎంక్వయిరీ చేయాలని ఎస్సై సుమన్‌ను ఆదేశించారు. ఎస్సై రంగంలోకి దిగి విచారించగా.. ఆ ఫోన్‌ నంబర్‌ కృష్ణా జిల్లా మువ్వ మండలం బట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన గొట్టిపాటి సందీప్‌ అడ్రస్‌తో ఉంది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసి నిందితున్ని కటకటాల్లోకి నెట్టినట్లు కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News