బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించ వద్దు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అధికారుల వైఫల్యమేనన్నారు నిమ్మగడ్డ.

Update: 2021-02-05 02:30 GMT

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో స్థానిక ఎన్నికలపై రివ్యూ చేశారు సమీక్ష నిమ్మగడ్డ. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని నిమ్మగడ్డ రమేష్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్ల వివరాలు సేకరిస్తున్నామన్నారు నిమ్మగడ్డ రమేష్‌. నెల్లూరు జిల్లా కావలిలో గతంలో 20 శాతానికి మించి ఏకగ్రీవాలు జరిగినా.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలన్న ఆలోచనకు వచ్చారన్నారు. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అధికారుల వైఫల్యమేనన్నారు నిమ్మగడ్డ.

అనంతరం ప్రకాశం జిల్లాలో పర్యటించారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్లు, ఏకగ్రీవాలపై సుదీర్ఘంగా చర్చించిన నిమ్మగడ్డ రమేష్‌.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం గుంటూరు జిల్లా అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. జిల్లా ముఖ్య అధికారులంతా సమీక్షలో పాల్గొన్నారు. తన బాధ్యతలు దాటి ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకునే అవసరం లేదన్నారు. అధికారులు నిజాయితీ, నిబద్ధతతో ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సూచించారు.

జిల్లాల పర్యటనలకు ముందు తిరుమల వెళ్లిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు నిమ్మగడ్డకు ఆశీర్వచనాలు అందజేశారు.స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని ఎస్‌ఈసీ తెలిపారు.

పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు.

Tags:    

Similar News