AP: అంగన్వాడీల ఆందోళన ఉద్ధృతం
ఉష శ్రీచరణ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న అంగన్వాడీలు... పలుచోట్లు రహదారుల దిగ్బంధం..;
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలను అంగన్వాడీలు ఉద్ధృతం చేశారు. మంత్రి ఉష శ్రీచరణ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న అంగన్వాడీలు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పలు చోట్ల రహదారులను దిగ్బంధించి నిరసన వ్యక్తంచేశారు. మరికొన్ని చోట్ల వినూత్న రీతిలో గళమెత్తారు. ఈ క్రమంలో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. డిమాండ్లు సాధించేవరకూ సమ్మె విరమించేదే లేదని స్పష్టంచేశారు. మచిలీపట్నంలో విజయవాడ జాతీయ రహదారిని అంగన్వాడీలు దిగ్బంధించారు. మూడు స్థంభాల సెంటర్‌లో రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా ఈడ్చిపడేశారు. పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. విజయవాడలో రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీలు... కనీస వేతనాలు మంజూరు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ప్రధాన డిమాండ్లను పక్కనపెట్టి సమ్మె విరమించుకోవాలని మంత్రులు కోరడంపై తీవ్రంగా మండిపడ్డారు. నందిగామ గాంధీ సెంటర్‌లో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పామర్రు NTR సర్కిల్‌లో రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
మైలవరంలో జాతీయ రహదారిపై నిరసనకు దిగడంతో... వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మంగళగిరిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వంటావార్పు నిర్వహించారు.ఒంగోలు CITU కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత రోడ్డుపై బైఠాయించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 11వరోజూ రాస్తారోకో నిర్వహించారు. పామూరు బస్టాండ్ కూడలి వద్ద రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కడపలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. YSR జిల్లా కమలాపురం మూడు రోడ్ల కూడలిలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైదుకూరులో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పుత్తా ప్రతాప్‌రెడ్డిని ఘెరావ్ చేశారు. కర్నూలులో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి డిమాండ్లు పరిష్కరించాలంటూ ధర్నా చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, మర్రిపాడులో రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు.
అనంతపురం శ్రీకంఠం కూడలిలో మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. రాయదుర్గంలో రాస్తారోకో చేశారు. మంత్రి ఉష శ్రీచరణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉరవకొండలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శింగనమలలో చెరువులో దిగి నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో తహసీల్దార్ కార్యాలయం ముందు భజన చేసి నిరసన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో హిందూపురం - పెనుకొండ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.