ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ( CM Chandrababu Naidu ) అన్నక్యాంటీన్లను ( Anna Canteens ) పునరుద్ధరించే ఫైల్‌పైనా సంతకం చేశారు. రూ.5కే అల్పాహారం, భోజనం అందించే ఈ క్యాంటీన్లకు గత టీడీపీ హయాంలో మంచి ఆదరణే లభించింది. వీటిని మళ్లీ తెస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఏపీలో 183 క్యాంటీన్లు నడిచాయి. సగటున రోజుకు 2.50 లక్షల మంది భోజనం చేసేవారు. ఈసారి క్యాంటీన్ల సంఖ్య ఏ మేరకు పెంచుతారు? బడ్జెట్ ఎంత కేటాయిస్తారనేది చూడాలి.
టీడీపీ ప్రభుత్వంలో అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అందులోభాగంగా దర్శిలో రూ.30 లక్షల వ్యయంతో భవన నిర్మాణం చేపట్టారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంతలో 2019 ఎన్నికలు రావటంతో నిర్మాణం నిలిచిపోయింది. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం వచ్చింది. సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ గురువారం సంతకం చేశారు. దీంతో మిగిలిన నిర్మాణం పనులు త్వరలో చేపట్టే అవకాశం ఉంది. పేదలకు భవన నిర్మాణం పూర్తయిన తర్వాత భోజనం సమకూర్చటం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు.