AP DSC: ఏప్రిల్ లో మెగా డీఎస్సీ
వచ్చే నెల మొదటి వారంలోనే నోటిఫికేషన్.... నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు..;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. వేసవి సెలవులు ముగిసి స్కూల్స్ రీఓపెన్ అయ్యే సమయానికి టీచర్ల భర్తీ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల ప్రారంభం నాటికి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టింగ్లు ఇవ్వాలన్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలా కాకుండా తాము సకాలంలో పోస్టులు భర్తీ చేసి అందరికీ న్యాయం చేస్తామన్నారు.
మే నుంచే తల్లికి వందనం:
తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మే నెల నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికే తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అమరావతి పనులు పట్టాలెక్కించామని, ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌లో అమరావతి నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.
సంక్షేమానికే పెద్దపీట
సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని చంద్రబాబు అన్నారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాలుగు వందలతో ప్రారంభించిన పింఛను నాలుగు వేలకు చేశామని తెలిపారు. ఇది దేశంలో ఎక్కడా లేదన్నారు. 204 అన్నా క్యాంటిన్లు పెట్టామన, ఇదో స్పూర్తి అని తెలిపారు. దీపం పథకం క్రింద ఆడబిడ్డలకు ఒక సిలెండర్ ఉచితంగా ఇచ్చామని, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని, చెత్త పన్ను రద్దు చేశామని చంద్రబాబు తెలిపారు. బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ ఇచ్చామని, చేనేతలకు జిఎస్టీ రద్దు చేశామని తెలిపారు.