AP: 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం

2026 డిసెంబర్ నాటికి ఎడమ కాలువ పూర్తి చేస్తాం... వైసీపీ వల్లే ఈ దుస్థితి వచ్చిందన్న చంద్రబాబు;

Update: 2025-03-28 04:00 GMT

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు గత పాలకుల అహంభావం, అనుభవలేమి, రాజకీయ కక్షల కారణంగా తీవ్ర నష్టపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గోదావరి జలాల్లో ప్రతి సంవత్సరం 2,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయని, అందులో 400 టీఎంసీలను సద్వినియోగం చేస్తే రాష్ట్రాన్ని కరవు రహితం చేయవచ్చని చెప్పారు. ఈ లక్ష్యంతోనే 1941లోనే ప్రాజెక్టు ప్రణాళికలు రూపొందించారని, అయితే అప్పుడు నిర్మించలేక ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారని గుర్తుచేశారు. గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. "వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితమిస్తాం. 2026 జూన్ నాటికి ఎడమ కాలువ, 2026 డిసెంబర్ నాటికి మిగిలిన చిన్న పనులను కూడా పూర్తి చేస్తాం" అని హామీ ఇచ్చారు. నిర్వాసితుల విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. "ప్రతీ నిర్వాసితుడికి న్యాయం జరుగుతుంది. ఒక్కరికీ కూడా అన్యాయం అనుభవించాల్సిన అవసరం లేదు" అని చంద్రబాబు తెలిపారు.

పోలవరాన్ని చూస్తే బాధేస్తోంది

పోలవరంలో డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం కూడా గత ప్రభుత్వానికి తెలీదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాజకీయ కక్షతో, అహంభావంతో గత ప్రభుత్వం పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరం చేసుకుని పనిచేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తాము అంకితభావంతో పని చేస్తే... వైసీపీ పోలవరాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం జగన్‌పైచంద్రబాబు పోలవరం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ పాలనలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. జగన్ నిర్లక్ష్యంతో రూ. వందల కోట్లు ప్రజాధనం వృధా అయింది. గత ప్రభుత్వం నిర్వాసితులను మోసం చేసింది. ప్రాజెక్ట్‌ కోసం భూములు ఇచ్చి వారు అనేక ఇబ్బందులు పడ్డారు. పోలవరం నిర్వాసితులకు వీలైనంత వరకు న్యాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

రివర్స్ టెండరింగ్‌తో రూ.990 కోట్ల నష్టం

వైసీపీ ప్రభుత్వం కాఫర్‌ డ్యాంను సకాలంలో పూర్తి చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టుకు ఇంత నష్టం జరిగేది కాదని చంద్రబాబు అన్నారు. పీపీఏ హెచ్చరించినా వినకుండా జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చిందని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.990 కోట్లు అదనపు ఖర్చు పెరిగిందన్న ఆయన.. 2025 డిసెంబర్‌ చివరినాటికి డయాఫ్రం వాల్‌ పూర్తి చేస్తామని వెల్లడించారు. "ఒక్కసారి ఓటేసినందుకు రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టును నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. నిపుణుల కమిటీ డయాఫ్రామ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించింది. దాన్ని తిరిగి నిర్మించాలని నిర్ణయించాం. కానీ, వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్టుపై కక్ష తీర్చుకుంది. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది." అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News