AP: ఏపీ మహిళలకు కూటమి సర్కార్ శుభవార్త
స్వాతంత్య్ర దినోత్సవం నుంచి ఉచిత బస్సు.. కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు;
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు అప్పుడు, ఇప్పుడు అంటూ ఆలస్యం అవుతుండగా.. కూటమి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. కర్నూలులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆగస్ట్ 15వ తేదీ నుంచి.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం నుంచి..
ఏపీలోని మహిళలందరికీ టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలువరించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.
25 లక్షల మంది మహిళలకు లబ్ధి
మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఇప్పటికే కూటమి నేతలు వెల్లడించారు. మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం, వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు.. ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.