CBN: ఎన్నికల సంఘం కన్నా జగన్ గొప్పవాడా..?
జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న చంద్రబాబు... పోలీసులు వద్దని చెప్పినా వెళ్లారని ఆగ్రహం;
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలని వైఎస్ జగన్‌కు.. సీఎం చంద్రబాబు సూచించారు. వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జగన్.. గుంటూరు పర్యటనకు వెళ్లారని అన్నారు. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని... ఎన్నికల సంఘం కంటే జగన్ గొప్పవారు కాదని స్పష్టం చేశారు. కోడ్ ఉన్నందున రావద్దని పోలీసులు చెప్పినా... జగన్ గుంటూరుకు వెళ్లారని చంద్రబాబు స్పష్టం చేశారు. కోడ్ ఉల్లంఘించి.. జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని చెప్పారు. కోడ్ ఉన్నందున రావడానికి వీల్లేదని పోలీసులు సైతం ఆయనకు తెలిపారన్నారు. రావొద్దని ముందే చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి.. తనకు భద్రత కల్పించ లేదని వైఎస్ జగన్ అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికల సంఘం కంటే.. వైఎస్ జగన్ గొప్పవారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఆరోపణలు అవాస్తవం
కృష్ణా జలాల్లో ఏపీ అధిక నీటిని వాడుకుంటుందన్న తెలంగాణ ఆరోపణలు అవాస్తవమని చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన మేరకే వాడుకుంటున్నామని తేల్చి చెప్పారు. సముద్రంలో కలిసే నీటినే అదనంగా వాడుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కరువును తరిమి కొడతామని సీఎం వెల్లడించారు. జల్‌జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని సరిగా వినియోగించుకోలేదని చంద్రబాబు వెల్లడించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు.
ఢిల్లీలో కొత్త యుగం ఆరంభం: చంద్రబాబు
దేశ రాజధానికి కొత్త యుగం ఆరంభమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పటినుంచి ఢిల్లీని విభిన్నంగా చూడబోతున్నారని వెల్లడించారు. ఢిల్లీలో అద్భుతమైన అభివృద్ధికి అంకురార్పణ జరిగిందని వెల్లడించారు. దేశ రాజధానిలో ఇప్పటినుంచి జరిగే మార్పులను చూసి పౌరులందరూ గర్వపడతారని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో బీజేపీ పాలన ప్రారంభం కావడంతో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు.