CBN: దీపావళి కానుక ప్రకటించిన చంద్రబాబు
అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు.. అర్హులందరికీ ఇస్తామన్న చంద్రబాబు;
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి దీపావళి సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ ఏర్పాట్లు చేయాలని.. 31 నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు.
కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు
మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి పథకం ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి.. అన్ని అర్హతలు కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్ధిదారులు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి సిలిండర్ కోసం బుకింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హామీల అమలు దిశగా..
ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్ల వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లోని పథకాల అమలును మొదలు పెట్టింది. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 31 తేదీ నుంచి ఈ పథకాన్ని మొదలు ప్రారంభించనున్నారు. సచివాలయంలో ఈ అంశంపై పౌరసరఫరాల శాఖతో సమీక్షించిన సీఎం, అక్టోబరు 31 తేదీ నుంచి పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.