AP: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

ఏపీని ఏఐ హబ్‌గా మారుస్తాం.. చెన్నై ఐఐటీ సదస్సులో చంద్రబాబు ప్రకటన;

Update: 2025-03-29 02:00 GMT

ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్‌ సహకారంతో క్వాంటమ్‌ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీని ఏఐ, డీప్‌ టెక్నాలజీ హబ్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే, గ్రీన్ ఎనర్జీ, భారత ఆర్థిక వ్యవస్థ, ఐటీ అభివృద్ధి గురించి ప్రస్తావించారు. చెన్నైలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-మద్రాస్‌’ (ఐఐటీఎం)లో శుక్రవారం జరిగిన ‘ఆలిండియా రిసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌-2025’లో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఐఐటీఎంలో ఆద్యంతం చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. .

సిలికాన్ వ్యాలీ తరహాలో...

సిలికాన్‌ వ్యాలీ తరహాలో త్వరలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్‌ వ్యాలీ రాబోతోందని చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్‌ టవర్‌ను నిర్మించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అన్ని అత్యాధునిక సాంకేతికతలు అందులో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీని దేశానికి కానుకగా ఇవ్వబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతతో పాటు అందరి జీవితాలకు పనికొచ్చే డీప్‌ టెక్నాలజీల్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. 1995లో ఐటీ ఎలా మొదలుపెట్టానో, 2025లో ఏఐ గురించి అలాగే ఆలోచిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. ఏపీకి వచ్చేందుకు గూగుల్‌ సుముఖత తెలిపిందని, డాటా సెంటర్‌ను పెడుతున్నట్లు వివరించారు. విశాఖ నుంచి సింగపూర్‌ దాకా సముద్రగర్భంలో సీ కేబుల్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఏపీకి రండి

ఐఐటీఎం విద్యార్థుల్లో ఎవరైనా స్టార్టప్‌ పెడుతుంటే వినూత్న ఆలోచనలతో ఏపీకి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఐఐటీ మద్రాస్‌లో 30 శాతం మంది వరకు తెలుగువారే ఉండటం గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో తలసరి ఆదాయం రూ.50 లక్షలు చేయాలని అనుకుంటున్నామన్నారు. మీరు విదేశాలకు వెళ్లి ఇంతకంటే ఎక్కువ సంపాదించి రాష్ట్రానికి తిరిగిచ్చే స్థాయికి రావాలని తెలుగు విద్యార్థులతో చెప్పారు.

బాహుబలి రేంజ్ లో చంద్రబాబు ఎంట్రీ

మద్రాస్ ఐఐటీలో నిర్వహించే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు పరిచయ కార్యక్రమంలో విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో ఆ ప్రాంగణమంతా.. బాహుబలి పట్టాభిషేకం సన్నివేశాన్ని గుర్తు చేసింది. చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబు కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు పేరు పలికినప్పుడల్లా ఐఐటీ విద్యార్థులు కేరింతలు కొట్టారు. విద్యార్థులు సైతం ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, ఆయన ప్రసంగం సమయంలో హర్షధ్వానాలతో హోరెత్తించారు.

Tags:    

Similar News