AP: తప్పుడు ప్రచారాన్ని ఖండించండి
కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం... సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ అవసరమన్న ఏపీ సీఎం;
ప్రతిపక్ష వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రెండు బృందాల మధ్య గొడవ జరిగి పరస్పరం తోసుకుంటే.. టీడీపీ నేతలు ఎస్సై చొక్కా పట్టుకున్నారని అభాండాలు వేశారని గుర్తు చేశారు. అక్కడేం జరగకపోయినా చొక్కా పట్టుకున్నట్లు చిత్రీకరించారని మండిపడ్డారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ, దారి తప్పినప్పుడు వాస్తవాలు చెప్పి, నియంత్రించడం అవసరమని చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత 36మందిని చంపేశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ఆందోళన చేశారు. ఆ పేర్లు అడిగితే, ఇవ్వలేదన్నారు. రాజకీయ నేతలే పత్రిక, టీవీ ఛానల్ పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వీటిని కలెక్టర్లు ఖండించాలన్నారు. చేసిన మంచిని చెప్పడం, ప్రజలను చైతన్యం చేయడం, అవాస్తవమైతే సాక్ష్యాధారాలతో చెప్పడం కలెక్టర్ల బాధ్యతని చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారాన్ని నిబంధనల ఛట్రంలో కాకుండా, మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. సహోద్యోగులతో మర్యాదగా మాట్లాడాలని... సమర్థంగా పని చేయించుకోవాలని సూచించారు.
కలెక్టర్లు చేసే తప్పులు ప్రభుత్వంపై ప్రతిబింబిస్తాయని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం, సంక్షేమాన్ని అమలు చేయడమే లక్ష్యంగా కలెక్టర్లు నూతన ఒరవడితో ముందుకెళ్లాలని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని... వీజీఎఫ్ కింద కేంద్రం, ఏపీ సర్దుబాటు చేసే విధానం తెచ్చారని తెలిపారు. నిత్యావసరాల ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణం కట్టడి, జీఎస్‌డీపీ తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడికక్కడే వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకోండన్నారు. అవసరమైతే ప్రభుత్వానికే ఒక యాప్ తెస్తామన్నారు. అందులో కలెక్టర్లు, తహసీల్దార్లకు సందేశాలు ఇవ్వొచ్చన్నారు.
ఇక పేదల సేవలో..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు పేదల స్థితి గతులను తెలుసుకోవాలని ఆదేశించారు. ఏం చేస్తే ప్రజలు పేదరికం నుంచి బయటపడతారో ఆలోచించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పేదలతో మాట్లాడాలని.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను ప్రోత్సహిస్తామని, పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే ఐదారేళ్లూ వారినే కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు.