LOKESH: బడుల్లో వసతులపై లోకేశ్ దృష్టి
ఏడాదిలోగా బడుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశం... మధ్యాహ్న భోజనం నాణ్యతపైనా ఆరా;
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలోగా బడుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని.. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వంలో అర్థాంతరంగా నిలిచిన...ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపైనా ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాల అధ్యయనానికి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
డ్రాప్ అవుట్స్ వివరాలూ అందజేయాలన్నారు. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు కారణాలను తెలియజేయాలని... బైజూస్ కంటెంట్, ఐబీ వినియోగంపై నివేదిక సమర్పించాలని సూచించారు. సీబీఎస్ఈ పాఠశాలలపై నివేదిక కోరారు. నెలాఖరులోగా స్టూడెంట్ కిట్ అందించాలని.. ఇంటర్ విద్యార్థులకు జులై 15నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు.
మరోవైపు సొంత నియోజకవర్గం మంగళగిరిలో సమస్యల పరిష్కారానికి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.....కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా...సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచుకున్న లోకేష్ ...మంత్రి అయ్యాక...సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు...ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో చెప్పిన లోకేశ్.... ఆ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో... మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యల పరిష్కారానికి వీలుగా...ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నపుడు.... ప్రతిరోజు ఇలా సమావేశాలు నిర్వహిస్తానని చెప్పిన లోకేశ్..వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని.... లోకేష్ తనను కలిసిన వారికి హామీ ఇచ్చారు.