Andhra Pradesh : పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం
Andhra Pradesh : ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణనే ఎందుకు బాధ్యుల్ని చేశారు? పదో తరగతి పరీక్షలు మొదలైన రోజు నుంచి ప్రతి పేపర్ బయటకు వస్తూనే ఉంది.;
Andhra Pradesh : ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణనే ఎందుకు బాధ్యుల్ని చేశారు? పదో తరగతి పరీక్షలు మొదలైన రోజు నుంచి ప్రతి పేపర్ బయటకు వస్తూనే ఉంది. ఏప్రిల్ 27 నుంచి మొదలైన 10వ తరగతి పరీక్షల్లో రోజుకో వివాదాన్ని ప్రభుత్వం మూటగట్టుకుంది. అత్యంత పకడ్బందీగా వ్యవహరించాల్సిన పరీక్షల నిర్వహణలో జగన్ సర్కార్ ఘోరంలో విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తు, వారి కష్టంలో సర్కార్ ఆటలాడుతోందంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించలేని ప్రభుత్వం అంటూ విపక్షాలు దాడి చేయడంతో.. జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది..
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌ల విషయంలో ఏదో ఒకటి చేయాలనుకున్న ప్రభుత్వం.. పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ ఘటనల్లో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసింది. 7 జిల్లాల్లో పేపర్ లీక్ అయ్యాయంటూ 50 మందిపై కేసులు నమోదు చేసి 30 మందిని సస్పెండ్ చేసింది. అటు ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందిపైనా కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టింది. అదే సమయంలో పేపర్ లీక్‌లో కార్పొరేట్ స్కూళ్ల పాత్ర ఉందంటూ సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ స్టేట్‌మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. నిజానికి ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్ వార్తల్ని మంత్రి బొత్స ఖండించారు. పరీక్ష మొదలైన తరువాత వాట్సప్‌లలో వచ్చాయంటూ, అదంతా చిన్న విషయంగానే తీసిపారేశారు. ఆ తరువాత లీకేజీలను ఆ భగవంతుడే ఆపాలంటూ మాట్లాడారు. విమర్శలు ఎక్కువవడంతో తెలుగుదేశమే కారణమంటూ విద్యాశాఖమంత్రి బొత్స ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. మొత్తం 38 మంది ప్రభుత్వ టీచర్లు, 22 మంది ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందిని అరెస్ట్ చేసినట్టు బొత్స ప్రకటించారు.
విద్యాదీవెన పథకానికి మీట నొక్కే సందర్భంలోనూ జగన్ నారాయణ, చైతన్య స్కూళ్ల పేర్లు ప్రస్తావించారు. మాజీ మంత్రి నారాయణ స్కూళ్లలో పేపర్ లీక్ చేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడారు. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడంతో పేపర్ లీక్‌పై పొలిటికల్ దుమారం రేగుతోంది. పరీక్షల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని నారాయణపై నెట్టారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజకీయపరమైన కక్షతోనే నారాయణను అరెస్టు చేశారని ఆరోపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు నారాయణను అరెస్ట్ చేసిందంటూ విమర్శించింది. పేపర్‌లీక్‌లు, మాల్ ప్రాక్టీస్‌పై సిట్టింగ్ జడ్జి విచారణకు గతంలోనే విపక్షాల డిమాండ్ చేసిన విషయాన్ని టీడీపీ గుర్తు చేసింది. మొత్తానికి.. డైవర్సన్ పాలిటిక్స్‌నే నమ్ముకున్న జగన్ సర్కారు... తమ అసమర్థను కప్పిపుచ్చుకునేందుకే నారాయణ అరెస్ట్‌ను చేశారంటున్నారు టీడీపీ నేతలు.