AP: ఏపీకి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు
సింగపూర్ పర్యటన విజయవంతం... ఏపీలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు;
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సింగపూర్ పర్యటన అనంతరం ఏపీకి వచ్చిన మంత్రి నారా లోకేష్ గురువారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూర్ పర్యటన సక్సెస్ అయిందని, మొత్తం రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ప్రత్యేక పర్యటన జరిగిందని తెలిపారు. అయితే అందరిలా “మేము ఎంవోయూలు కుదుర్చుకోవడం లేదు. ఒప్పందాల్ని నేరుగా అమలు చేసే దశకు తీసుకొస్తున్నాం,” అని లోకేశ్ అన్నారు. పెట్టుబడుల కోసం జూమ్‌కాల్ ద్వారా ఆర్సెలర్ మిత్తల్‌ను స్వయంగా ఆహ్వానించామని చెప్పారు. దేశంలో అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, డేటా సెంటర్లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ అధికారులకు మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని అందులో పేర్కొన్నారు. మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయి. పెట్టుబడుల కోసం తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కలిసికట్టుగా పనిచేస్తాయని లోకేశ్ అన్నారు.
ఏపీ బ్రాండ్ నాశనం
“2019 నుంచి 2024 మధ్య జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అమరావతిని కలిసి అభివృద్ధి చేద్దామని సింగపూర్ ప్రభుత్వమే ముందుకు వచ్చింది. కానీ, అప్పటి ప్రభుత్వం సింగపూర్‌తో ఉన్న ఒప్పందాల్ని నిర్లక్ష్యంగా రద్దు చేసింది. పారదర్శకతకు పేరుగాంచిన దేశమైన సింగపూర్‌పై అవినీతి ఆరోపణలు మోపారు. అమర్‌రాజా, లులు వంటి కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు. అయినా ఏపీకే అదృష్టంగా చంద్రబాబు గారు ఉన్నారు. బెంగళూరుకు కర్ణాటక, చెన్నైకి తమిళనాడు, ఇక ఐటీ రంగ అభివృద్ధికి విశాఖపట్నంను కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నాం,” అన్నారు లోకేశ్. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమి కేటాయించామని లోకేశ్ అన్నారు. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారని... తక్కువ ధరకు భూముల్ని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదని... టీసీఎస్‌కు ఇచ్చామన్నారు. ఉద్యోగాలు వస్తాయని రూ.99పైసలకే భూములు ఇస్తున్నాం. అందులో తప్పేంటని ప్రశ్నించారు.