ఏపీ లిక్కర్ స్కాం కేసులో తన కొడుకు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ లో నిబంధనలు పాటించలేదని కేసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. హైదరాబాద్ లో నోటీసు ఇచ్చినప్పుడు చెప్పిన కారణాలు వేరని, కస్టడీ రిపోర్టులో వేరే రీజన్స్ వెల్లడించారని కేసిరెడ్డి తండ్రి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయవాడకు తరలించాక అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అయితే అరెస్ట్ సమయంలో కానీ, కస్టడీ సమయంలో కానీ పీసీ యాక్ట్ పై కేసి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, సుప్రీంకోర్ట్ పిటిషన్ లో మాత్రం కొత్త అభ్యంతరాలను లేవనెత్తుతున్నారని ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువురి వాదనలను విన్న జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సాయంత్రంలోగా లిఖిత పూర్వక వాదనలు సమ ర్పించాలని ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది. రెండు పేజీలకు మించకుండా వాదనలు ఉండాలని స్పష్టం చేసింది. బెయిల్ కోసం హైకోర్టునే కేసిరెడ్డి ఆశ్రయించాలని సూచించింది.