రెండో విడత ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు.. పోలింగ్ బూత్‌పై రాళ్ల దాడి
గెలుపును జీర్ణించుకోలేని వైసీపీ మద్దతుదారులు.. పోలింగ్ బూత్ పై రాళ్ల దాడి చేశారు.;
ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మొదటి విడతలో జరిగినట్లుగానే రెండో విడతలోనూ గొడవలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపులో తేడా వచ్చిందని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కేవలం స్వల్ప తేడాతో గెలుపొందినట్లు ప్రకటించడంతో.. ఓట్ల లెక్కింపులో లోపాలు జరిగాయని, వెంటనే రీకౌంటింగ్ చేయాలంటూ టీడీపీ మద్దతుదారులు ధర్నాకు దిగారు. ఓట్ల లెక్కింపులో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల వైఖరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ మద్దతుదారులు నిర్ణయించారు.
అటు గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం కర్లగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ రెబల్ అభ్యర్థి దేవుళ్ల కోటేశ్వరరావు.. వైసీపీ మద్దతుదారుడు వెంకటేశ్వరరావు మధ్య పోటాపోటీ నెలకొంది. తొలుత 8 ఓట్ల తేడాతో వైసీపీ రెబల్ అభ్యర్థి కోటేశ్వరరావు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థి వెంకటేశ్వరావు కోరగా.. 5 ఓట్ల మెజార్టీ వచ్చాయి. దీంతో రీకౌంటింగ్ చేయాలని ఇరువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలోనూ వైసీపీ మద్దతుదారుల తీరుతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న12వ పోలింగ్ బూత్‌లో కొత్తగా చేర్చిన 30 ఓటర్లతో మధ్యాహ్నం రెండున్నర తర్వాత వైసీపీ మద్దతుదారులు ఓటు వేయించారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. వైసీపీ మద్దతుదారులకే ఓటర్ల లిస్టు ఇస్తున్నారని.. తమకు ఇవ్వడం లేదని ఆయన చెబుతున్నారు. లిస్టు ప్రకారం 30 మంది ఓటర్లు లైన్లో వేచిఉండాలని.. కానీ నేరుగా పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారని ముప్పిడి వెంకటేశ్వరావు ఆరోపిస్తున్నారు. దీనిపై కొవ్వూరు ఆర్డీవో, కలెక్టర్, ఎన్నికల కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అటు అనంతపురం జిల్లాలోనూ టీడీపీ, వైసీపీ మద్దతుదారులు ఘర్షణ నెలకొంది. టీడీపీ మద్దతుదారుల గెలుపును ఓర్చుకోలేని వైసీపీ మద్దతుదారులు పోలింగ్ బూత్‌పై రాళ్లతో దాడి చేశారు. బత్తలపల్లి మండలం మాల్యావంతంలో టీడీపీ మద్దతుదారులు కుంటాల దేవి 26 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాప్తాడు మండలం కేంద్రం పంచాయతీలో టీడీపీ మద్దతుదారుడు సాకే తిరుపాల్ 244 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలో రెబల్ అభ్యర్థి శశికళ 706 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే వీరి గెలుపును జీర్ణించుకోలేని వైసీపీ మద్దతుదారులు.. కనగానపల్లిలో పోలింగ్ బూత్ పై రాళ్ల దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.