ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించారు. అలాగే మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. అదే విధంగా 12 జిల్లాల్లో ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగిస్తున్నట్లు సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, కడప ఎస్పీగా నచికేత్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు యథాతథంగా ఆయా జిల్లాల్లోనే కొనసాగనున్నారు. మరోవైపు తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు మరోసారి నియమితులయ్యారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తర్వాత ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడు బదిలీ అయ్యారు. అయితే మరోసారి ఆయనకు తిరుపతి జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించారు. తిరుపతి ఎస్పీగాఉన్న హర్షవర్ధన్ రాజును ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. ఇటీవల టీటీడీ ఈవో దగ్గర నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది.
చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల తర్వాత జిల్లా ఎస్పీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు... వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలే కీలకమని చంద్రబాబు వెల్లడించారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, సింగయ్య మృతి కేసు స్టడీలుగా చూడాలని సూచించారు. ఇన్వెస్టిగేషన్లో టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్ చూపించవచ్చు అన్నారు.. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించండి అని దిశానిర్దేశం చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి.. అదే సమయంలో అసాంఘిక శక్తులు భయపడేలా పని చేయాలని స్పష్టం చేశారు. "సోషల్ మీడియా పోస్టులపై ఫోకస్ పెట్టండి.. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయండి" ఎస్పీలకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.