AP: ఏపీలో రేవంత్ వ్యాఖ్యల కలకలం
రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ సర్కార్.. రాజకీయ లబ్ధి కోసమే వ్యాఖ్యలన్న ఏపీ.. సీమ నీటి విషయంలో రాజీ ఉండదని స్పష్టం
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు... ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ సమయంలో మాట్లాడిన రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు జరిగిన క్లోజ్ రూమ్ సంభాషణ గురించి ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టిందని, ప్రతి రోజు 3 టీఎంసీల నీటిని వినియోగించాలని అనుకుందని రేవంత్ చెప్పారు. అయితే, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏదైన విషయాల మీద చర్చ జరగాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని తాను చంద్రబాబును కోరానని రేవంత్ అన్నారు. తమ మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు ఆపేశారని, అది తాను సాధించిన విజయమని అన్నారు.
రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగాయా లేదా వెళ్లి చూసుకోవాలని, కేసీఆర్ లేదా హరీష్ రావులతో నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. జగన్ ను ఇంటికి పిలిచి పంచభక్ష పరవాణ్ణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు 3 టీఎంసీలు ఇచ్చి కమిషన్లు తీసుకున్న చరిత్ర వాళ్లదని కేసీఆర్, హరీష్ లనుద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ను భుజం తట్టి వెన్ను తట్టి ప్రోత్సహించారని చెప్పారు. వారి చరిత్ర అదని, వారి నీతి అది అని అన్నారు.
ఖండించిన ఏపీ సర్కార్
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని పేర్కొంది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించింది. ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని తెలిపింది. ‘‘జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారు. సీమకు రోజుకు 3 టీఎంసీలంటూ ప్రకటనలతో జగన్ ప్రభుత్వం పనులు చేపట్టింది. జగన్ ప్రచారంతో లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసింది. కేంద్రం, ఎన్జీటీతో పాటు పలుచోట్ల ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదులను విచారించి.. అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేయించింది’’ అని ఏపీ ప్రభుత్వం తెలిపింది.