AP: అమెరికా సుంకాలపై కేంద్రానికి చంద్రబాబు లేఖ
వృద్ది రేటులో రెండోస్థానంలో ఏపీ;
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వారంగాన్ని ఆదుకోవాలని, సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా యూఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందన్న చంద్రబాబు.. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్‌పై అమెరికా 27శాతం సుంకం విధింపు వల్ల ఆక్వారంగానికి నష్టమని పేర్కొన్నారు. అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని, ఈ విషయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్వారంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వృద్ది రేటులో రెండోస్థానంలో ఏపీ
ఆదాన్ న్యూస్: దేశంలో వృద్ధిరేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్‌లోకి వచ్చింది. స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలో ఏపీ వృద్ధి రేటు 2.02 శాతం పెరిగి 8.21గా నమోదైంది. ప్రస్తుత ధరల విభాగంలో 12.02 శాతంగా ఉంది. వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానానికి చేరడంపై సీఎం చంద్రబాబుహర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’ అంటూ సీఎం పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజల సమష్టి విజయమంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. దీనిపై ఏపీ మంత్రులు, కూటమి నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు.